కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ.15.88 కోట్లకు పెరిగింది. వయనాడ్ నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు రాహుల్. అందులో స్థిరాస్తుల విలువ రూ.10.08 కోట్లు, చరాస్తుల విలువ రూ.5.80 కోట్లుగా తెలిపారు.
గడిచిన ఐదేళ్లలో రాహుల్ ఆస్తుల విలువ సుమారు రూ.6 కోట్లకు పైగా పెరిగింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ రూ.9.4 కోట్లుగా వెల్లడించారు.
సొంత కారు లేదు
అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీకి సొంత కారు కూడా లేదు. బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రూ.72 లక్షల అప్పులు తీసుకున్నట్లు తెలిపారు.
రాహుల్‌పై ఐదు కేసులు
రాహుల్ తనపై ఐదు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
చేతిలో రూ.40 వేలు
ప్రస్తుతం తన వద్ద రూ. 40 వేల నగదు మాత్రమే ఉన్నట్లు తెలిపారు రాహుల్. బ్యాంకుల్లో రూ.17.93 లక్షల డిపాజిట్లు ఉన్నాయన్నారు. వివిధ సంస్థల మ్యూచువల్ ఫండ్లలో బాండ్లు, డిబెంచర్లు, షేర్ల రూపంలో రూ.5.19 కోట్లు పెట్టుబడుల రూపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 333.3 గ్రాముల బంగారం ఉందని తెలిపారు.
దిల్లీలోని సుల్తాన్‌పుర్ గ్రామంలో వారసత్వంగా వస్తున్న పొలంలో వాటా ఉన్నట్లు తెలిపారు. గురుగ్రామ్‌లో రెండు కార్యాలయాల స్థలాలు ఉన్నాయని చెప్పారు.
2017-18 ఆర్థిక సంవత్సరానికి తన మొత్తం రాబడి రూ. 1.11 కోట్లుగా ఉందని తెలిపారు.
ఆదాయ వనరులు
ఎంపీ జీతం, రాయల్టీ ఆదాయం, అద్దె, బాండ్ల వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని తన ఆదాయ వనరులుగా చూపించారు రాహుల్ గాంధీ.