కరోనా కాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన '#స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్' ప్రచారంలో భాగంగా రాహుల్ ఓ వీడియో విడుదల చేశారు.
"కరోనా ప్రజలకు తీవ్రంగా హాని కలిగిస్తోంది. ఇప్పటికే ఎందరో విద్యార్థులు ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఐటీ సహా ఇతర కళాశాలల్లో పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు పంపుతున్నారు. కానీ యూజీసీ మాత్రం విద్యార్థులను అయోమయంలో పడేసింది. ఈ కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం సబబు కాదు. పరీక్షలు రద్దు చేసి.. పూర్వ ఫలితాల ఆధారంగా వారిని పై తరుగతులకు పంపాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
సోషల్ మీడియాలో అనేక మంది విద్యార్థులు కోరుతున్నట్లుగా... ఆరు నెలల పాటు కళాశాల ఫీజులు వసూలు చేయకూడదని... విద్యార్థుల రుణాలపై వడ్డీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ.
తాజాగా విద్యార్థులకు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది యూజీసీ. అయితే, పరీక్షలకు హాజరు కాలేనివారు.. ప్రత్యేక పరీక్షలు నిర్వహించినప్పుడు రాసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. ఈ మార్గదర్శకాలను కేంద్ర హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి.
ఇదీ చదవండి: సీఐసీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల