'వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో వేస్తాం'
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేసి చెత్తబుట్టలో వేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని మోగాలో ఖేతీ బచావో పేరుతో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేసే చర్యలను చేపట్టిందని మండిపడ్డారు. పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం.. రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో యువతి అత్యాచారం, మృతిపై మరోసారి స్పందించిన రాహుల్... బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జిల్లా మేజిస్ట్రేట్ ఆమె కుటుంబాన్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమే అయితే పార్లమెంటులో వాటిపై ఎందుకు చర్చించలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.