భారత్‌లో సామాజిక దిగ్గజాలు ఫేస్‌బుక్, వాట్సాప్ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని వ్యాఖ్యానించారు.
భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలపై వస్తోన్న అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.
"భారత ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యంపై ఫేస్‌బుక్, వాట్సాప్ దాడి చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. దేశ వ్యవహారాల్లో విదేశీ సంస్థయినా, ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకునేందుకు వీలులేదు. వారిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలి. తప్పు చేసినట్లు గుర్తిస్తే శిక్షించాలి."
- రాహుల్ గాంధీ ట్వీట్
భాజపా-వాట్సాప్..
వాట్సాప్‌తో భాజపాకు సంబంధాలు ఉన్నాయని అంతకుముందు రాహుల్ ఆరోపించారు.
"భాజపా-వాట్సాప్ ఒప్పందాన్ని అమెరికా టైమ్ మాగజైన్ బయటపెట్టింది. భారత్‌లో 40 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ తన పేమెంట్ సేవల ప్రారంభించేందుకు మోదీ ప్రభుత్వం సాయం వాట్సాప్‌నకు అవసరం. అలా వాట్సాప్‌పై భాజపాకు పట్టు లభించింది" అని రాహుల్ ఆరోపణలు చేశారు.
'మార్క్'కు లేఖలు..
ఇటీవలే భాజపా- ఫేస్‌బుక్ పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు లేఖలు రాసింది. భాజపా అనుకూల వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేసింది. టైమ్ మ్యాగజైన్లో వచ్చిన 'భాజపా-ఫేస్‌బుక్ క్విడ్‌ప్రోకో' కథనంపై స్పందించాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'మీ చర్యలేంటి?'- ఫేస్‌బుక్‌కు కాంగ్రెస్ రెండో లేఖ