కోర్టు ధిక్కరణ కేసులో మరో ప్రమాణపత్రాన్ని దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. వివరణను స్పష్టంగా నివేదించాలని ఆదేశించింది.
కాపలాదారే దొంగ అని రఫేల్ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
పొరపాటే
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై నేడు విచారణ జరిపింది. తన వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించడం పొరపాటుగా జరిగిందని రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ప్రమాణపత్రంలో విచారం వ్యక్తంచేయడం... క్షమాపణ చెప్పడం లాంటిదేనని విన్నవించారు.
ఏం చెప్పాలనుకుంటున్నారు?
రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. ఓసారి తప్పు చేశామని, మరోసారి చేయలేదని అంటున్నారని రాహుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ విషయంలో వివరణను స్పష్టంగా సమర్పించాలని ఆదేశించింది.
"అసలు అఫిడవిట్లో ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం మాకు కష్టమవుతోంది."
-- ధర్మాసనం
ఈసారి దాఖలు చేసే ప్రమాణపత్రంలో రాజకీయాల ప్రస్తావన వద్దని రాహుల్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.
క్షమాపణ చెప్పాల్సిందే
భాజపా ఎంపీ మీనాక్షి లేఖీ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ధిక్కరణ కేసుల్లో విచారం వ్యక్తంచేస్తే సరిపోదని, బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఇరుపక్షాల వాదన విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది.