1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, అందుకు అయన క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సిక్కు అల్లర్లకు బాధ్యులైన వారికి తప్పక శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు. 1984 నాటి విషాద ఘటనపై ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, తన తల్లి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు చాలా విషాదకరమని, అలాంటి ఘటనలు ఇంకెప్పుడూ సంభవించకూడదన్నదే కాంగ్రెస్ అభిప్రాయమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు రాహుల్.
మాకు సంబంధం లేదు...
మరోవైపు 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రస్ పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
నా మాటలు వక్రీకరించారు...
తను చేసిన వ్యాఖ్యలకు శ్యామ్ పిట్రోడా క్షమాపణ చెప్పారు. హిందీలో తను అన్న మాటలను పూర్తిగా వక్రీకరించారని అన్నారు. తనకు హిందీ సరిగా రాకపోవడాన్ని అవకాశంగా తీసుకుని విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను (ఏదో జరిగిందో... అది తప్పు) అని చెప్పాలనుకున్నాను. కానీ సరైన మాటలు చెప్పలేకపోయాను' అని వివరణ ఇచ్చారు. సిక్కులపై జరిగిన దాడులకు తానెంతో బాధపడ్డానని చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మాశాలలో గురువాలం ఓ విలేకరి పిట్రోడాను సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు పిట్రోడా చెప్పిన సమాధానం తీవ్ర దుమారం రేపింది.
ఇదీ చూడండి: ఫొని ధాటికి నేలకూలిన పది లక్షల వృక్షాలు!