వేణువు మధుర గానం వినిపిస్తే ఎక్కడి నుంచా అని అటుగా పరుగెత్తాడు రిపోర్టర్. తేనియలొలికే మురళీ మాధుర్యత దగ్గరైన కొద్దీ పెద్ద కళాకారుడేనని అంచనాకు వచ్చాడు. అంతలోనే వేణుగానం ఆగిపోయింది. లాఠీ ఊపుకుంటూ ఎదురొచ్చాడు ఓ పోలీసాయన. ఆయనని దాటి మళ్లీ ముందుకెళ్తుండగా వెనకాలే వినిపించింది మురళీ సమ్మోహన గానం. తిరిగి చూస్తే లాఠీ కమ్ ప్లూటును వాయిస్తూ పోలీసాయన.
హుబ్బళ్లి గ్రామీణ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ చంద్రకాంత్ హుట్గీ లాఠీనే ప్లూటుగా మార్చి వాయిస్తున్నాడు. ఫ్లూటుగా మారిన లాఠీ వేణుగానాలతో సహచరులకు శ్రవణానందం కలిగిస్తున్నాడు. మధుర మురళి పలికే రాగాలకు విధి నిర్వహణలో ఉన్న సహచరులు ఒత్తిళ్లను మరిచిపోయి ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఆయన కళకు మంత్రముగ్దులైన సహచరులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల నుంచీ ప్రశంసలందుకొంటోంది. ఏకంగా అదనపు డీజీ భాస్కర్ రావు ప్రత్యేక నగదు పురస్కారం ఇచ్చారని మురిసిపోతూ చెప్పారు చంద్రకాంత్.