భార్యాబాధితుల ఆందోళనతో దిల్లీ జంతర్‌మంతర్ హోరెత్తింది. మహిళా కమిషన్ తరహాలో పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. పురుష కల్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
గృహ హింస, వరకట్నం వేధింపుల చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయని, వీటితో న్యాయం అరుదుగా లభిస్తోందన్నది పురుష కల్యాణ్ ట్రస్ట్ సభ్యుల ఆరోపణ. లొసుగులను ఆసరాగా చేసుకొని పెట్టిన తప్పుడు కేసులు కోకోల్లలనీ... ఫలితంగా పురుషులకు అన్యాయం జరుగుతోందన్నది వారి వాదన. ఇలాంటి కారణాలతోనే దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెప్పారు ట్రస్ట్ సభ్యులు. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కమిషన్ ఏర్పాటయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామంటున్నారు.
"ఈ విగ్రహం గాయపడిన భీష్ముణ్ని ప్రతిబింబిస్తుంది. తప్పుడు కేసులతో వేధింపులకు గురవుతున్న దేశంలోని పురుషులందరి గుర్తుగా ఈ విగ్రహాన్ని తయారుచేశాం. ఈ ట్రస్టును 2005లో ప్రారంభించాం. మొదటగా తక్కువ మందితో ప్రారంభమైన ఈ ట్రస్టు క్రమంగా ప్రజాదరణ పొందింది. "
- రిత్విక్ బిసారియా, ఉపాధ్యక్షుడు, పురుష కల్యాణ్ ట్రస్ట్
మహిళలు సైతం
పురుష కల్యాణ్ ట్రస్ట్‌లో మహిళలు సభ్యులుగా ఉండడం విశేషం. వీరిలో కొందరు జంతర్‌మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్నారు.
"నేను మహిళనే. కానీ అమ్మను కూడా. నా కొడుకు వేధింపులకు గురయ్యాడు. ప్రభుత్వ చట్టాలతో అనేక బాధలు పడ్డాడు. నిజాయితీగా ఉన్నా కేసులు తప్పలేదు. మహిళలు, పురుషులకు సమాన చట్టాలు ఉండాలి. మహిళ తప్పు చేసినా శిక్ష పడాలి. నా కొడుకుపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. ఆరేళ్ల పోరాటం తర్వాత కేసు గెలిచాం. కానీ తప్పుడు కేసు పెట్టిన నా కోడలికి మాత్రం ఎలాంటి శిక్ష విధించలేదు."
-సురిందర్ కౌర్, ట్రస్ట్ సభ్యురాలు, చంఢీగఢ్
ఇదీ చూడండి: "కాస్త బుర్ర వాడండి"