కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో చేస్తున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. 'రైల్ రోకో'ను మరో మూడురోజులు పొడిగిస్తున్నట్టు తెలిపాయి రైతు సంఘాలు. తొలుత ప్రకటించిన ప్రకారం.. మూడురోజుల రైల్ రోకో కార్యక్రమం ఆదివారం (సెప్టెంబర్ 26)తో ముగియాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఈ నెల 29 వరకు రైల్‌రోకో కొనసాగనుంది.
రైతుల ఆందోళనల్లో భాగంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా.. ఫిరోజ్‌పుర్ రైల్వేస్టేషన్లో ఈ నెల 26 వరకు అన్ని రైల్వే సేవలను నిలిపివేసింది రైల్వే శాఖ.
ప్లాన్ ఇదే..
మూడురోజుల నిరసనల్లో సెప్టెంబర్ 27న మహిళా సంఘాలు పాల్గొననున్నాయి. మరుసటి రోజు(సెప్టెంబర్ 28) భగత్‌సింగ్ జన్మదినం సందర్భంగా.. యువత ఆందోళన చేపడతారని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. అయితే.. ఈ ఆందోళనలో ఏ రాజకీయ పార్టీల నాయకులను అనుమతించమని.. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
వ్యయసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. హరియాణా, ఒడిశాల్లో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకస్తూ శిరోమణి అకాళీ దళ్ నేత, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ నెల 17న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేంద్రం ఆమోదించిన బిల్లులివే..
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన రెండు బిల్లులు (ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్) ఈ నెల 20న రాజ్యసభలో ఆమోదం పొందాయి.
ఇదీ చదవండి: 'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం