సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ (ఏఐపీటీ)లో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సందర్భంగా దక్షిణ కమాండ్ లైజాన్ విభాగం( సైనిక నిఘా విభాగం), పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి.. ఈ రాకెట్‌ను పట్టుకున్నారు. ఓ ఆర్మీ జవాను సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
" ఈ రోజు ఏఐపీటీ మైదానంలో జరుగుతోన్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కాం గురించి సైనికాధికారుల నుంచి మాకు సమాచారం అందింది. సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశాం. సైనిక నియామక కార్యాలయంలో పనిచేస్తున్న హవిల్దార్ జైదేవ్ సింగ్ పరిహార్, దళారి వెల్ సింగ్ రావత్‌లను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నాం. 17 మంది ఆశావహులకు ఆర్మీలో ఉద్యోగాలు కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. వారిని సంప్రదించేందుకు రవీంద్ర రాఠోడ్‌ను మధ్యవర్తిగా వినియోగించారు. అతన్ని కూడా అరెస్ట్ చేశాం."
- బచ్చన్ సింగ్, డిప్యూటీ కమిషనర్ (క్రైం)
ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు పోలీసులు. వన్వాడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు ఇతర నియామకాల్లోనూ పాల్గొనటం సహా మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండొచ్చనే అంశంపై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది నక్సల్స్ లొంగుబాటు