పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ సంస్థ(జేఈఎమ్) బృందంలోని అందరినీ భారత సైన్యం 45 రోజుల్లోనే మట్టుబెట్టిందని అధికారిక వర్గాలు తెలిపాయి. జేఈఎమ్ కమాండర్లు సైన్యం చేతిలో హతమయ్యారు.
వీరిని అంతమొందించేందుకు సాంకేతిక, నిఘా వర్గాలు సహకారమందించాయి. తీవ్రవాదులను అంతమొందించాలనే లక్ష్యంతో బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 66 మంది ముష్కరులు హతమయ్యారు. వీరిలో 19 మంది జేఈఎమ్ సంస్థకు చెందిన వారు. 27 మంది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులున్నారు.
40 మంది జైషే సంస్థ మద్దతుదారులను విచారించగా లభించిన సమాచారంతో దాడులు నిర్వహించి ఉగ్రవాదుల పనిబట్టింది సైన్యం.
పుల్వామా ఉగ్రదాడిలో పాత్ర వహించిన నిసార్ అహ్మద్ తంత్రయ్, సజ్జాద్‌లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్బంధంలో ఉన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్‌కు వాహనాన్ని సమకూర్చింది ఇతడే అని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
గత కొన్నేళ్లుగా సైన్యం నిర్వహించిన దాడుల్లో జేఈఎమ్ కీలక కమాండర్లు మహ్మద్ ఉమర్, ఉస్మాన్ ఇబ్రహీం హైదర్లు హతమయ్యారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపట్ల వైఖరిలో మార్పు సుస్పష్టం'