పాకిస్థాన్ సైన్యం గగనతలంలో చేసిన దాడిని సమర్థంగా ఎదుర్కొని అమితమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గౌరవార్థం పుదుచ్చేరిలో 321 కేజీల భారీ చాక్లెట్ విగ్రహాన్ని రూపొందించారు. ఓ కేఫ్ తయారుచేసిన 5 అడుగుల 10 అంగుళాల ఎత్తైన అభినందన్ చాక్లెట్ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు.
"అభినందన్ విగ్రహాన్ని తయారుచేసి వారు సైన్యానికి గొప్ప గౌరవమిచ్చారు. పాకిస్థాన్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ను మనం తిరిగి కాపాడుకున్నాం. సరిహద్దులో ఆయన గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆయనే మన నిజమైన హీరో. జూకా కేఫ్ వారు ఈ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేయడం సైన్యానికి ఇస్తున్న గొప్ప గౌరవం."
-సందర్శకుడు
ఈసారి అభినందన్...
ప్రతి ఏడాది ప్రముఖుల్లో ఎవరో ఒకరి విగ్రహాన్ని రూపొందించే కేఫ్... ఈసారి అభినందన్ ప్రతిమను తయారు చేసింది. దాదాపు 132 గంటలు శ్రమించి దీన్ని రూపొందించినట్లు ఆ కేఫ్ యజమాని తెలిపారు. గతంలో మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, చార్లీ చాప్లిన్, రజనీకాంత్, మహేంద్రసింగ్ ధోనీల విగ్రహాలనూ రూపొందించిందీ కేఫ్.
"ఈ విగ్రహంలో మనం ఓ దిగ్గజాన్ని చూస్తున్నాం. వీరు చాలా ఉన్నతమైన పని చేశారు. చాక్లెట్‌తో విగ్రహం తయారు చేయడం గొప్ప విషయం. ఆ దేశం నుంచి అభినందన్ బయటపడతారని అనుకోలేదు. కానీ తిరిగివచ్చారు. ఆయన యువ తరానికి ఓ గొప్ప ఆదర్శం."
-కార్తీక్, సందర్శకుడు
అభినందన్ సాహసాలు
బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాక్ వాయుసేన.. మన దేశంపై దాడికి యత్నించింది. ఆ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్-16ను తరిమివేస్తుండగా అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. దీంతో అభినందన్‌ను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇదీ చదవండి: దిల్లీ హింసకు కాంగ్రెస్ బాధ్యత వహించాలి: అమిత్ షా