బిహార్‌లో ఎన్నికల ప్రచార సభలో సీఎం నితీశ్ కుమార్ బుధవారం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్సా నియోజకవర్గ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు ఆర్జేడీకి అనుకూల నినాదాలు చేయడమే ఇందుకు కారణం.
నితీశ్ మాట్లాడే సమయంలో కొందరు వ్యక్తులు 'లాలూ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. నితీశ్ స్పందిస్తూ.. 'అర్థం లేని మాటలు మాట్లాడే వారు ఎవరో కాస్త చేయి పైకి లేపాలి. సభలో గందరగోళం సృష్టించొద్దు. నాకు ఓటు వేయాలనే ఉద్దేశం మీకు ఉంటే వేయండి. లేకపోతే లేదు. అంతేగానీ ఇక్కడ గందరగోళం సృష్టించొద్దు' అంటూ నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ప్రసంగానికి అంతరాయం కలిగించేలా నినాదాలు చేస్తున్న వారి ప్రవర్తన ఆమోదయోగ్యమైనదేనా అని నితీశ్ సభలో ఉన్నవారిని ప్రశ్నించగా.. ఆయన మద్దతుదారులు 'లేదు'అని గట్టిగా బదులిచ్చారు. ఆ సమయంలో వేదికపై నితీశ్‌తో పాటు చంద్రిక రాయ్ ఉన్నారు. చంద్రిక రాయ్ గతంలో ఆర్జేడీ నాయకుడు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్‌కు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన అనంతరం తలెత్తిన వివాదాల కారణంగా ఆయన ఆ పార్టీని వీడారు. ఇటీవల సీఎం నితీశ్ సమక్షంలో జేడీయూలో చేరారు.
ఇదీ చూడండి: ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేతపైకి చెప్పులు