ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం రోడ్‌షో నిర్వహించనున్నారు. ప్రియాంక రోడ్ షోకు విస్తృత ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
ప్రధాని రోడ్షోలాగే..
ఏప్రిల్ 25న వారణాసిలో నామినేషన్ వేసేందుకు ప్రధాని మోదీ ఎక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారో... అక్కడి నుంచే బుధవారం ప్రియాంక రోడ్ షో మొదలవుతుంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలోని మదన్ మోహన్ మాలవీయ విగ్రహం నుంచి రోడ్ షో ఆరంభమవనుంది. దశాశ్వ్మేధ్ ఘాట్ వద్ద ర్యాలీ ముగుస్తుంది. ప్రధాని రోడ్‌షో కూడా ఇదే ప్రాంతంలో ముగిసింది.
ఆలయాల్లో పూజలు..
రోడ్ షో అనంతరం నగరంలోని కాశీ విశ్వనాథ ఆలయం, కొత్వాలి ప్రాంతంలోని కాల భైరవ ఆలయాల్లో ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రధాని మోదీపై పోటీగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలుస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఉత్కంఠకు తెరదించుతూ వారణాసి స్థానంలో అజయ్ రాయ్‌ను బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ.
దేశంలో సాధారణ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఏడో విడతలో భాగంగా వారణాసి లోక్‌సభ స్థానానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి.