ఉత్తరప్రదేశ్ కాన్పుర్‌లోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఈవ్ టీజింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మహిళ అభ్యర్థనను వినిపించుకోకుండా ఆమె ధరించిన ఆభరణాలు, ఆహార్యం గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చినవారు చెప్పింది వినడం పోలీసుల కనీస బాధ్యత అని ప్రియాంక అన్నారు. ఒకవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతుంటే, మరోవైపు వారిని కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రియాంక ఘాటుగా ట్వీట్ చేశారు.
యూపీలో గత కొంత కాలంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ సర్కారును తీవ్రంగా విమర్శించారు ప్రియాంక. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.