లోకసభ ఎన్నికల రణరంగానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార శంఖారావం పూరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ఆచరిస్తున్న 'చౌకీదార్' ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రియాంక. ఈ 'చౌకీదార్' ధనవంతుల కోసమేనని, పేదల పక్షం కాదని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగంపైనా ప్రియాంక పదునైనా విమర్శలు చేశారు. ప్రస్తుతమున్న నిరుద్యోగం గతంలో ఎన్నడూ చూడలేదని ఆరోపించారు. నలుగురు, ఐదుగురు పెద్దల చేతిలోనే ప్రభుత్వం బందీ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ ఎన్నికల్లో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ఎన్నికలు మీ మంచి కోసమే కాదు..దేశం కోసం కూడా. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోంది..ఒక నలుగురు ఐదుగురు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మొత్తం సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశారు. దేశాన్ని పాలించడం ఇలా కాదు. సర్కారు, దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నంత నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేదు. నా మాటలు మనసులో పెట్టుకోండి. ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని, మిమ్మల్ని శక్తిమంతం చేసుకోండి. వివేకంతో వ్యవహరించండి. ఈ దేశం మీది." - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి