కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని గుర్తు చేశారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు మోదీ. ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఆనందాలు దూరమైపోతాయని, అప్రమత్తతతోనే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని స్పష్టం చేశారు.
" కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ పూర్తయింది. కానీ వైరస్ మాత్రం ఇంకా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా నిబంధనలు పాటించకపోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాస్కులు లేకుండా అజాగ్రత్తగా తిరిగితే మీతో పాటు మీ పిల్లలు, పెద్దలను ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలి. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడవద్దు. "
-ప్రధాని నరేంద్ర మోదీ
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా విజృంభణ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది ఏడో సారి