కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థ చర్యలతో విజయవంతంగా నిలువరించిన దిల్లీ ప్రభుత్వం, కేంద్రం, అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రాష్ట్రాలకూ దిల్లీ ఆదర్శంగా నిలిచిందని, ఇవే విధానాలను దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని సూచించారు.
దేశంలోని కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు.
వైరస్ను కట్టడి చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం కచ్చితంగా కొనసాగించాలని స్పష్టం చేశారు మోదీ. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు మోదీ.
ధన్వంత్రి రథ్...
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ధన్వంత్రి రథ్ కార్యక్రమాన్ని సమావేశంలో ప్రస్తావించారు మోదీ.
కరోనా దృష్ట్యా ఆస్పత్రులకు సాధారణ రోగులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ధన్వంత్రి రథ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సాధారణ రోగులకు సేవలు అందిస్తోంది. ఇదే తరహా విధానాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు ప్రధాని.
ఇదీ చూడండి:- దేశంలో మరో 27,114 కేసులు.. 519 మరణాలు