అంపన్ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు.
బంగాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నట్లు వెల్లడించారు.
"ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించి, సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. ఉపశమన, పునరావాస చర్యల గురించి ఈ సమావేశాల్లో చర్చిస్తారు."
-ప్రధానమంత్రి కార్యాలయం
తుపాను బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ పెను తుపాను బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. ఈ తుపాను దాటికి బెంగాల్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తుపాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84మంది మృతిచెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 72మంది మృతిచెందినట్టు సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు.
ఇదీ చదవండిః 'అంపన్' మిగిల్చిన విషాదం- 72 మంది మృతి