'ఫిట్ ఇండియా ఉద్యమం' ప్రారంభం సందర్భంగా వ్యాయామంపై దేశ ప్రజలకు సందేశం అందించారు ప్రధాని. సాంకేతికత గణనీయంగా పెరిగినందున ప్రతి ఒక్కరిలో శారీరక శ్రమ తగ్గిపోయిందన్నారు. ఫలితంగా గతంలో 60 ఏళ్లకు గుండెపోటు వస్తే... ఇప్పుడు 30- 40 ఏళ్లకే వస్తోందన్నారు. పిల్లలు మైదానాల్లో క్రీడలు మానేసి సెల్‌ఫోన్లలో ఆటలు ఆడుతున్నారని.. రోజుకు 2 వేల అడుగులు కూడా వేయని పరిస్థితి వచ్చిందని తెలిపారు. వ్యాయామానికి దూరంగా ఉంటే అనేక జబ్బులు చేరువవుతాయని.. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని సూచించారు.
"చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మారడం వల్లే 30ఏళ్లకే గుండెపోటు బారిన పడుతున్నారు. ఫిట్‌నెస్ ప్రాధాన్యతపై విస్తృత చర్చ జరగాలి. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. చాలా దేశాలు పౌరుల ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాయి. ఫిట్‌నెస్ కోసం చైనా.. 2030 మిషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
విజేతల జీవితాల్లో ఏకైక లక్షణం 'ఫిట్‌నెస్'
వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతామని.. ఫిట్‌నెస్ లేకపోతే రోజువారీ జీవితం కూడా స్తబ్దుగా ఉంటుందని తెలిపారు ప్రధాని. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోతే.. కూర్చొనే, నిలబడే సామర్థ్యం, ఏకాగ్రత అన్నీ తగ్గుతాయన్నారు. విజేతలైన అందరి జీవితాల్లో కనిపించే ఏకైక లక్షణం... ఫిట్‌నెస్ అని ప్రధాని పేర్కొన్నారు.
దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజుజు, ఎంపీ గౌతమ్ గంభీర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.