సరిహద్దు ఉద్రిక్తల మధ్య టిక్‌టాక్, వీబో సహా 59 చైనా యాప్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో చైనా సామాజిక మాధ్యమం వీబోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతా ఇంకా ఎందుకు ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే యాప్స్‌ను నిషేధించిన సమయంలోనే వీబోను వీడాలని మోదీ నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది. బుధవారం మోదీ ఖాతాలోని పోస్టులు, ప్రొఫైల్ ఫొటో, కామెంట్లను తొలగించారు.
అయితే వీఐపీలు వీబోను వీడే ప్రక్రియ సాధారణం కన్నా క్లిష్టంగా ఉంటుంది. అందుకే వీబోలో మోదీ ఖాతా ఇంకా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రక్రియ మరింత జాప్యం కావడానికి కారణాలు చైనాకే తెలుసంటూ పరోక్షంగా ఆ దేశాన్ని తప్పుబట్టాయి ప్రభుత్వ వర్గాలు.
రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ చైనా సామాజిక మాధ్యమ దిగ్గజం వీబోలో ఖాతా తెరిచారు. వీబోలో 2,44,000మంది మోదీని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు 115 పోస్టులు చేశారు.
జిన్‌పింగ్ ఉంటే కష్టమే...
అధికారులు తీవ్రంగా శ్రమించి బుధవారం నాటికి 115 పోస్టుల్లో 113 పోస్టులను డిలీట్ చేశారు. మిగిలిన రెండు పోస్టుల్లో ప్రధాని మోదీ- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోలున్నాయి. వీబోలో జిన్‌పింగ్ ఉన్న ఫొటోలు, పోస్టులను తొలగించడం చాలా కష్టం. అయితే పోస్టులు తొలగించినప్పటికీ మోదీని అనుసరించే వారి సంఖ్యలో మాత్రం మార్పులేదు.
ఇదీ చూడండి:- భారత్-చైనా మధ్య మరిన్ని 'శాంతి' చర్చలు!