దేశ అభివృద్ధి పథంలో రైతులు ఎల్లప్పుడూ వెన్నంటే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల్లో స్వావలంబన తీసుకొచ్చేందుకు గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. వాటి ఫలితంగానే కరోనా మహమ్మారి సమయంలోనూ వ్యవసాయ రంగం పురోగమించిందని చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో జరిగిన చౌరీ చౌరా శతాబ్ది వేడుకల్లో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ.. వందేళ్ల క్రితం జరిగిన ఈ ఉద్యమంలో రైతులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
"రైతులకు ప్రయోజనకరంగా ఇప్పటివరకు చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపై.. మండీలు రైతులకు లాభదాయకంగా మార్చేందుకు వెయ్యికి పైగా మండీలను ఈ-నామ్‌తో అనుసంధానిస్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశం ఐక్యంగా ఉండటమే తమ ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ భావనతోనే దేశ ప్రజలంతా కలిసిమెలిసి ముందుకు సాగాలన్నారు.
చౌరీ చౌరా ఘటన పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టడం వరకే పరిమితం కాలేదని మోదీ అన్నారు. దేశ ప్రజల హృదయాల్లోనూ ఈ జ్వాలలు ఎగసిపడ్డాయని చెప్పారు. ఈ ఘటన అందించిన సందేశం ఎనలేనిదని పేర్కొన్నారు. పలు కారణాల వల్ల దీన్ని చిన్న సంఘటనగా పరిగణిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చౌరీ చౌరాలో ఘటనలో అమరులైనవారి గురించి ప్రస్తుతం పెద్దగా మాట్లాడుకోవడం లేదని అన్నారు. చరిత్రలో వారికి ప్రాధాన్యం దక్కకపోయినా.. వారి రక్తం దేశంలోని మట్టిలో ఉందని, అది ప్రజలకు నిరంతర ప్రేరణ అందిస్తుందని పేర్కొన్నారు.
99 మందికి సత్కారం
చౌరీ చౌరా శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా తపాలా బిళ్లను ఆవిష్కరించారు మోదీ.
చౌరీ చౌరా ఘటనకు వచ్చే ఏడాదికి వందేళ్లు నిండనున్న నేపథ్యంలో సంవత్సరం పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 75 జిల్లాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
చౌరీచౌరా ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలోని స్మారక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది యోగి సర్కార్.
చౌరీ చౌరా అంటే..
దేశ స్వాతంత్ర పోరాటంలో చౌరీ చౌరా ఘటన ఓ విశిష్ట ఘట్టం. 1922 ఫిబ్రవరి 4న చౌరీచౌరాలో సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్న వారిపై బ్రిటిష్ సైన్యం కాల్పులు జరపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన ఉద్యమకారులు అక్కడి పోలీసు పోస్టుపై దాడి చేసి 24 మంది బ్రిటిష్ భద్రతా సిబ్బందిని హతమార్చారు.