ఏడో శతాబ్దపు చారిత్రక కట్టడాలు 21వ శతాబ్దపు మైత్రికి సాక్షిగా నిలిచాయి. పల్లవ రాజులు ప్రాణప్రతిష్ఠ చేసిన ఏకశిల నిర్మాణాలే వేదికగా ఇద్దరు అగ్రనేతలు స్నేహస్ఫూర్తిని చాటారు. బంగాళాఖాతంలో కోరమండల్ తీరాన కొలువుతీరిన మామల్లాపురం (మహాబలిపురం)లో మామూలు వ్యక్తుల్లా కలియదిరుగుతూ అధికార లాంఛనాలకు దూరంగా.. గతకాలపు వైభవాన్ని వీక్షిస్తూ రెండు దేశాల నడుమ భవిష్యత్ దృఢ బంధానికి అంకురార్పణ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నడుమ ఇష్టాగోష్ఠి ఆద్యంతం ఆత్మీయంగా సాగింది. సూర్యాస్తమయ వేళ ఆహ్లాదకర వాతావరణంలో రాతి నిర్మాణాలను వీక్షిస్తూ, తాజా కొబ్బరినీళ్లను సేవిస్తూ, భారత సాంస్కృతిక వారసత్వానికి దర్పణం పట్టిన నృత్య ప్రదర్శనలను తిలకిస్తూ, పసందైన విందును ఆస్వాదిస్తూ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. కశ్మీర్ అంశంపై క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఫలప్రద చర్చలకు ఒక సానుకూల వాతావరణాన్ని ఇది ఏర్పరిచింది.
సాయంసంధ్య వేళలో ముచ్చట్లు
మోదీ, జిన్‌పింగ్ మధ్య గత ఏడాది చైనాలోని వుహాన్ నగరంలో ఇలాంటి ఇష్టాగోష్ఠి భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సంప్రదాయ తమిళ ధోతీ, ఉత్తరీయం, తెల్ల చొక్కా ధరించిన మోదీ మామల్లాపురంలో అర్జున తపో శిలాప్రాంతంలో జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. ఈ పట్టణానికి చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌కు మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మామల్లాపురంలోని ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో ఉన్న అర్జున తపో ప్రాంతం, పంచరథం, తీర ప్రాంత ఆలయాలను ఇద్దరు నేతలు సందర్శించారు. కృష్ణుడి వెన్నముద్దగా వ్యవహరించే ఒక భారీ గ్రెనైట్ రాతి వద్ద కరచాలనం చేసుకున్నారు. అక్కడ స్వేచ్ఛగా కలియతిరిగారు.
మామల్లాపురం ప్రాశస్త్యాన్ని వివరించిన ప్రధాని
తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించిన జిన్‌పింగ్.. అపురూప గుహలు, రాతి నిర్మాణాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఈ అద్భుత కట్టడాల ప్రాశస్త్యాన్ని మోదీ స్వయంగా ఆయనకు వివరించారు. నేతల వెంట ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉన్నారు. పంచరథ ప్రాంగణం వద్ద మోదీ, జిన్‌పింగ్‌లు 15 నిమిషాల పాటు ఆశీనులయ్యారు. ఏకశిలపై భారత శిల్పకళా కౌశలానికి ప్రతీకగా నిలిచిన ఈ నిర్మాణం వద్ద కొబ్బరి నీళ్లు సేవిస్తూ అగ్రనేతలు సమాలోచనలు సాగించారు. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత మైత్రికి ఇది దర్పణం పట్టింది. అనంతరం వీరు తీరప్రాంత ఆలయానికి పయనమయ్యారు. పల్లవ రాజ వంశీకుల ఘన సాంస్కృతిక వారసత్వానికి ప్రబల నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతం వద్ద విడిగా కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాలు వారి వెంట వచ్చాయి. ఈ ఆలయం ఎదుట కనులపండువగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.
క్షీణించిన సంబంధాల నడుమ...
కశ్మీర్ అంశంపై కఠిన వైఖరి నేపథ్యంలో ఇటీవల ఇరుదేశాల నడుమ సంబంధాలు క్షీణించాయి. జిన్‌పింగ్ ఇటీవల పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. అందులో కశ్మీర్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న తాజా భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ద్వైపాక్షిక మైత్రికి కొత్త దిశను ఇచ్చే మార్గదర్శక సూత్రాలపై ఈ సదస్సులో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని భారత్‌లో చైనా రాయబారి సన్‌వెయిడాంగ్ పేర్కొన్నారు. కశ్మీర్, సరిహద్దు వివాదంపై నెలకొన్న విభేదాల నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం, అభివృద్ధి అంశాల్లో సహకారాన్ని వేరు చేయడంపై మోదీ, జిన్‌పింగ్‌లు దృష్టిసారిస్తారని అధికారులు చెప్పారు.
జిన్‌పింగ్‌కు అపూర్వ స్వాగతం
అంతకుముందు జిన్‌పింగ్ ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. విదేశాంగ మంత్రి వాంగ్ యి సహా 90 మందితో కూడిన ప్రతినిధి బృందం ఆయన వెంట ఉంది. చెన్నై విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రన్‌వేపై దాదాపు 500 మంది తమిళ జానపద కళాకారులు ‘తప్పాట్టం’, ‘పొయ్ కాల్ కుదురై’, ‘చండ మేళం’, ‘కరగాట్టం’, సన్నాయి మేళతాళాలు వంటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భరతనాట్య కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తూ అలరించారు. వివిధ ఆలయాల అర్చకులు జిన్‌పింగ్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో చిన్నారులు భారత్, చైనా జెండాలతో రోడ్డు పక్కన నిలబడి ఆయనకు అభివాదం చేశారు. అనంతరం ఆయన గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు వెళ్లి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, సాయంత్రం 4 గంటల సమయంలో మామల్లాపురం పయనమయ్యారు. మార్గమధ్యంలో ఈస్ట్‌కోస్ట్ రోడ్డుపై అనేక ప్రాంతాల్లో కళాకారులు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, సంగీతంతో జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. ఇష్టాగోష్ఠి భేటీ కోసం చెన్నై చేరుకున్న మోదీకి తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులు స్వాగతం పలికారు. ‘‘చెన్నైలో కాలుమోపాను. అద్భుత సంస్కృతి, ఆతిథ్యానికి మారుపేరుగా నిలిచిన మనోన్నత తమిళనాడు చేరుకోవడం ఆనందదాయకంగా ఉంది’’ అని ఇంగ్లిష్, తమిళం, చైనీస్ భాషల్లో మోదీ ట్వీట్ చేశారు.
విందు భేటీ
తీరప్రాంత ఆలయం వద్ద జిన్‌పింగ్ గౌరవార్థం మోదీ ఒక ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సుమారు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల నుంచి 8 మంది చొప్పున ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే వీరు మోదీ, జిన్‌పింగ్‌కు కొద్దిదూరంలో ఆశీనులయ్యారు. ఈ విందులో చెట్టినాడ్ వంటకాలు, సాంబారు, రసం సహా పసందైన తమిళ రుచులు చవులూరించాయి. అనేక శాకాహార, మాంసాహార వంటకాలను అతిథులకు వడ్డించారు.