కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కచ్చితంగా పుంజుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో ఇది సాధ్యమై తీరుతుందని పేర్కొన్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడడానికి తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని పేర్కొన్న ఆయన.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తగిన సంస్కరణలు చేపట్టామన్నారు.
"ఒక వైపు ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచాలి. మరోవైపు మనం ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాలి. అలాగే వృద్ధిని వేగవంతం చేయాలి. నాకు నమ్మకం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా పుంజుకుంటుంది." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
విశ్వాసం కలిగిస్తాం..
'రైతులు, చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే.. మన ఆర్థిక వృద్ధి తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసం కలుగుతోంది' అని మోదీ అన్నారు.
అన్లాక్ 1.0
కరోనా, లాక్డౌన్ల వల్ల నెమ్మదించిన ఆర్థిక పురోగతి, అన్లాక్ 1.0తో తిరిగి పుంజుకుంటుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
5 'ఐ'లపై దృష్టి
దేశాన్ని వృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ... ఇంటెంట్ (లక్ష్యం) , ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడులు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాలు), ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు) అనే 5 'ఐ'లు అత్యంత అవశ్యకమని మోదీ పేర్కొన్నారు.
దీర్ఘకాల దృష్టితో..
తమ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా, దీర్ఘకాలిక దృష్టితో సంస్కరణలు చేపడుతోందని మోదీ పేర్కొన్నారు. తాము ధైర్యంగా సంస్కరణలు చేపట్టి, దేశ ఆర్థికాభివృద్ధిని తిరిగి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: తుపాను రూపంలో మరో పెను విపత్తు