బంగాల్లో డిసెంబర్ నాటికి రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆ రాష్ట్ర భాజపా యువ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి, భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై దాడులను ఖండించారు.
బంకురా జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
"రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. భాజపా కార్యకర్తలను హత్య చేయడం రోజువారీ కార్యక్రమంలా మారింది. రాష్ట్రంలో డిసెంబర్ నాటికి రాష్ట్రపతి పాలన విధిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా."
-సౌమిత్రా ఖాన్
'మీ రాష్ట్రాలను చూసుకోండి!'
సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. భాజపా పాలిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లోనే చట్టబద్ధ పాలన నశించిందని ఆరోపించింది. ముందుగా ఆ రాష్ట్రాలపై దృష్టిసారించాలని భాజపా నేతలకు హితవు పలికింది.
"రాష్ట్ర ప్రభుత్వానికి అపకీర్తి కలిగించేలా భాజపా శాంతి, భద్రతల అంశాన్ని లేవనెత్తుతోంది. వామపక్షాల హయాంలోని పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి, భద్రతలు మెరుగ్గా ఉన్నాయి. న్యాయబద్ధమైన పాలన కనుమరుగైన ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌పై భాజపా నేతలు దృష్టిసారించాలి."
-సౌగత రాయ్, టీఎంసీ ఎంపీ
బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని భాజపా జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు భాజపా నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి- దక్షిణ కొరియా ప్రధానితో మోదీ సంభాషణ