దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు ప్రధాని నరేంద్రమోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయంపై చర్చించారు. కరోనా హాట్‌స్పాట్లు మినహాయించి దశల వారీగా ఆంక్షలు సడలించేలా ప్రణాళిక ఉండాలని మంత్రులకు సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావంపై మంత్రులతో మోదీ చర్చించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు పనుల కొనసాగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కరోనా హాట్స్పాట్లను మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఒక్కో శాఖ నెమ్మదిగా పనులు ఆరంభించేలా ప్రణాళికను రూపొందించమని మంత్రులకు సూచించారు ప్రధాని.
ఇదే సమావేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, గవర్నర్లు, పార్లమెంటు సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సంబంధిత అత్యవసర ఉత్తర్వుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాది పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించింది. రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులు రద్దు చేసి కరోనాపై పోరుకోసం ప్రభుత్వ సంచిత నిధికి పంపిస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చూడండి : 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'