కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్... ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికెత్తారు. తూర్పు దిల్లీ నిర్మాణ్ విహార్‌లో జరిగిన భాజపా విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. భారత్‌ను విశ్వశక్తిగా మార్చేందుకు మోదీ విశేష కృషి చేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు హర్షవర్ధన్.
చిన్నతనంలో ఒక పుస్తకం చదివాను. అందులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్యోతిషులు చెప్పిన భవిష్యత్తు గురించి ఉంది. అందరి అంచనాలు చదివి... అన్నింటిలో ఒక విషయం ఉన్నట్లు గమనించాను. 21వ శతాబ్దంలో భారతదేశం విశ్వశక్తిగా మారుతుందని ఉంది. దీనికోసం ఒకరు భారత్‌లో జన్మిస్తారని ఉంది. రెండో దశాబ్దంలో భారత్ విశ్వశక్తిగా ఎదగటానికి కావాల్సిన పునాదులు వేస్తారని ఉంది. ఈ విషయాలన్నీ నేను పాఠశాలలో ఉన్నప్పుడు చదివాను. అనంతరం నేను వైద్య కళాశాలలో విధ్యనభ్యసించి రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. 40-45 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని వెతుకుతున్నా. జ్యోతిషులు చెప్పినట్లు భారత్‌ను విశ్వశక్తిగా మార్చటానికి వచ్చే ఆ వ్యక్తి ఎవరు? అని ఎదురుచూస్తున్నా. చాలా మంది దేశం కోసం ముఖ్యమైన పనులు చేశారు. గత ఐదేళ్లు ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తరువాత జ్యోతిషులు 500 ఏళ్ల క్రితం చెప్పిన వ్యక్తి మోదీనే అని నాకు అనిపించింది.
- హర్షవర్ధన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి