మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి(ఆర్ఆర్) వైద్యులు తెలిపారు. ప్రణబ్ ఆరోగ్యాన్ని నిపుణులతో కూడిన బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ.. ఈ నెల 10న మధ్యాహ్నం ఆర్ఆర్ ఆస్పత్రిలో చేరారు. మెదడులో ఏర్పడిన గడ్డలను తొలిగించేందుకు సోమవారం అయనకు ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ..
మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ప్రణబ్ కుమార్తె షర్మిష్టా ముఖర్జీతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆసుపత్రికి వెళ్లి.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు రాజ్‌నాథ్.
మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!