2018 జూన్ 7... నాగ్‌పుర్‌లోని రేషిమ్‌బాగ్ మైదానం... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయంసేవకుల కోసం నిర్వహించిన మూడేళ్ల శిక్షణా కార్యక్రమం ముగింపు సభకు హాజరయ్యారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ముఖ్య అతిథిగా కీలక ప్రసంగం చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవడం అప్పట్లో పెను సంచలనం. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, వ్యూహచతురుడిగా పేరున్న ప్రణబ్ ముఖర్జీ ఆనాడు ఆ కార్యక్రమంలో మాట్లాడిన తీరు రాజకీయ విశ్లేషకులనే తలలు పట్టుకునేలా చేసింది. పార్టీలకతీతంగా ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆ సమావేశం రుజువు చేసింది.
ఆ సమావేశంలో తనదైన శైలిలో ఆర్ఎస్ఎస్ ప్రబోధిస్తున్న హిందూ జాతీయవాదానికి భిన్నమైన బహుళత్వ జాతీయవాదాన్ని ప్రణబ్ నొక్కి చెప్పారు.
"ఆధునిక భారత దేశం జాతి, మతం పేరు మీద నిర్మాణం కాలేదు, బహుళత్వ ప్రాతిపదికన పలువురు మహనీయుల ఆలోచనల నుంచి రూపొందింది. ఒక ప్రాంతం, ఒక మతం, గుర్తింపు, ద్వేషం, అసహనం అనే భావనల ఆధారంగా జాతీయతను నిర్వచిస్తే అది భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ గుర్తింపును నాశనం చేస్తుంది.
సహనం, బహుళత్వం అనేవి భారతీయుల శక్తి. భారత జాతీయవాదం అనేది రాజ్యాంగబద్ధ జాతీయవాదంగా ఉండాలి."
- ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి
లౌకికవాదులు, సొంత పార్టీ వారించినా ఆర్ఎస్ఎస్ శిక్షా వర్గ సమావేశానికి హాజరయ్యారు ప్రణబ్. అంతేకాదు ఆ సంస్థ మౌలిక భావజాలంపై పరోక్షంగా లోతైన విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది.
ఆ సమావేశానికి ఆయన హాజరవడంపై భాజపా దిగ్గజ నేత ఎల్కే అడ్వాణీ కీలక వ్యాఖ్యలు చేశారు.
"అందరినీ ఆదరించే గుణమే ప్రణబ్‌ను గొప్ప నేతగా తీర్చిదిద్దింది. ఆయన అనుభవం చాలా గొప్పది. ఇలాంటి సమావేశాల అవసరం గురించి ప్రణబ్ ఆలోచించడం ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని దేశానికి పంపుతుంది."
- ఎల్కే అడ్వాణీ, భాజపా సీనియర్ నేత
భారత రత్న రావడం వెనుక...
దాదాకు భారత రత్న వెనుక రాజకీయ లబ్ధితో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలు కారణమని అప్పట్లో విశ్లేషకులు భావించారు. 'కాంగ్రెస్ వివాద పరిష్కర్త'కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం అప్పటి ఎన్డీఏ సర్కారుకు మంచి పేరునే తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్.. సీనియర్ నేతను నిర్లక్ష్యం చేసిందని, మోదీ సర్కారు భారతరత్నతో గౌరవించిందని అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ప్రచారం సాగింది.