స్వతంత్ర భారత చరిత్రలో సింహభాగం రాజకీయ యవనికపై ప్రణబ్ ముఖర్జీ ముద్ర ప్రత్యేకం. వివిధ అంశాలపై ఆయనకున్న అవగాహన, అసాధారణ నైపుణ్యం అమోఘం. అందుకే సాధారణ క్లర్క్ స్థాయి నుంచి ఎదిగి... దేశ అత్యున్నత పదవిని అలంకరించగలిగారు. అలాంటి ప్రణబ్‌కు ప్రధాని పదవి మాత్రం అందలేదు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన దాదాకు ప్రధాని పదవి రెండుసార్లు అందినట్టే అంది చేజారింది.
ఇందిరా మరణానంతరం...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం నిబంధనల ప్రకారం పార్టీలోని సీనియర్ నేత ప్రధాని పదవి చేపట్టాలి. ఇదే విషయం.. రాజీవ్, దాదా మధ్య మనస్పర్థలకు కారణమైంది.
ఇందిర హత్య సమయంలో రాజీవ్, ప్రణబ్ బంగాల్లో ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు. ఆ సమయంలో తాత్కాలిక ప్రధాని ఎవరు అవుతారని రాజీవ్... ప్రణబ్‌ను అడిగారట. 'పార్టీలోని సీనియర్ నేత ప్రధాని పదవి చేపడతారు. నెహ్రూ, లాల్‌బహుదూర్ శాస్త్రి మరణానంతరమూ అదే జరిగింది' అని ప్రణబ్ బదులిచ్చారని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన రాజీవ్... దాదా హోదా తగ్గించారని వినికిడి. ఈ విధంగా మొదటి సారి కొద్దిలో ప్రణబ్‌కు ప్రధాని పదవి దూరమైంది.
రాజీవ్ మరణానంతరం....
రాజీవ్ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్ ముఖర్జీనే సీనియర్. అయితే అంతకుముందు పార్టీ వీడి మళ్లీ చేరినందున, పార్టీ సిద్ధాంతాల ప్రకారం సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. ఫలితంగా, సీనియార్టీ జాబితాలో వెనుకంజలో నిలిచిపోయారు. ఇలా మరోసారి ప్రధాని పదవి దక్కినట్టే దక్కి చేజారింది.