మధ్యప్రదేశ్ భోపాల్లో భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, 'నాథూరాం గాడ్సే' గురించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై 'వాస్తవ నివేదిక' అందించాలని మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ శుక్రవారం ఆదేశించింది.
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్... మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను.. గొప్ప దేశభక్తుడు అంటూ అభివర్ణించారు. రాజకీయ దుమారం రేగడం వల్ల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలూ చెప్పారు.
"ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని, వారి మనసును నొప్పించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వేళ ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతాను. ఈ దేశానికి గాంధీజీ చేసిన సేవలను మరిచిపోలేము. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నా మాటలను మీడియా వక్రీకరించింది."-సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, భాజపా నేత
'నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడు'
'స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే (నాథూరామ్ గాడ్సే)' అని, మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వి ప్రజ్ఞాసింగ్ మండిపడ్డారు. బదులుగా నాథూరామ్ గొప్ప దేశభక్తుడని అభివర్ణించారు.
"నాథూరామ్ గాడ్సే దేశభక్తుడు. అతను ఎప్పటికీ దేశభక్తుడుగానే ఉంటారు. అతనిని తీవ్రవాదిగా పిలుస్తున్నవారు, బదులుగా తమను తాము చూసుకోవాలి. ఆయనపై విమర్శలు చేసిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు."- ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, భాజపా నేత
ఈనెల మొదట్లో మతపర ఉద్రిక్తతలు ప్రోత్సహించేలా ప్రసంగించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రజ్ఞాసింగ్పై ఈసీ మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధించింది.
ఇదీ చూడండి: బోఫోర్స్ దర్యాప్తు కొనసాగుతుంది: సీబీఐ