జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడంపై భాజపా ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. గాడ్సే వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు.
ప్రగ్యా క్షమాపణలు కోరినప్పటికీ.. విపక్షాలు నిరసనలు చేపట్టాయి. క్షమాపణలు ఆమోదించేది లేదని.. సభ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో వివిధ పార్టీల సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. ప్రగ్యా వ్యాఖ్యలపై నేతలో చర్చలు జరిపారు. ప్రగ్యా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏకాభిప్రాయనికి వచ్చారు నేతలు.
ఆ భేటీ అనతరం సభలో మరోమారు క్షమాపణలు కోరారు ప్రగ్యా. విపక్షాల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన ప్రకటనను చదివి వినిపించారు.
"నేను దేశం కోసం ఏం చేస్తున్నానో అదే చెప్పాలనుకుంటున్నా. నవంబర్ 27న ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో నాథూరాం గాడ్సే దేశభక్తుడని నేను సంబోధించలేదు. కనీసం అతడి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇప్పటికీ ఎవరైనా బాధపడితే.. నేను దానికి చింతిస్తున్నా. క్షమాపణలు కోరుతున్నా."
- ప్రగ్యా సింగ్ ఠాకూర్, భాజపా ఎంపీ
క్షమాపణల ప్రకటన చేసేందుకు ముందు తన విరోధుల గురించి చెప్పేందుకు ప్రయత్నించారు ప్రగ్యా. కానీ.. ఆమె మాటలను స్పీకర్ అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: ఎవరేమన్నా డోన్ట్ కేర్- ఆమె ఉగ్రవాదే: రాహుల్