కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. విద్యుత్ రంగానికి సంబంధించి పలు సహాయక చర్యలకు ఆయన ఆమోదముద్ర వేశారు. లాక్డౌన్ కాలంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి తమ శాఖ కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు లాక్డౌన్ కాలంలో విద్యుత్‌శాఖ తీసుకునే చర్యలపై ప్రకటన విడుదల చేశారు. తమ మార్గదర్శకాలను రాష్ట్రాల్లోని విద్యుత్ నియంత్రణ సంస్థలు అమలు చేయాలని సూచించారు.
విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ బొగ్గు కంపెనీల ద్వారా బొగ్గు ఉత్పత్తి, రైల్వేల ద్వారా రవాణాను కొనసాగించేందుకు వీలుగా ఆయా శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది విద్యుత్‌శాఖ.
లాక్డౌన్ కారణంగా వినియోగదారులు తమ బకాయిలను పంపిణీ సంస్థలకు (డిస్కంలు) చెల్లించలేరని తమ ప్రకటనలో పేర్కొంది విద్యుత్‌శాఖ. ఇది డిస్కంల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ కారణంగా ఉత్పత్తి, రవాణా సంస్థలకు చెల్లించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అంచనా వేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే.
- విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, పంపిణీ సంస్థలకు మధ్య అధిక మొత్తంలో బకాయిలు ఉన్నా.. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాలి.
- పెనాల్టీ, ఆలస్య రుసుములు వసూలు చేయకూడదు. జరిమానాలపై మూడునెలల పాటు తాత్కాలిక నిషేధం.
- జెన్కోలకు చెల్లించాల్సిన మొత్తంపై కేంద్ర విద్యుత్ రెగ్యూలేటరీ (సెర్క్) సంస్థ మూడు నెలలపాటు మారటోరియం విధింపునకు ఆదేశం.
- ప్రస్తుత అత్యవసర సమయంలో ఏ డిస్కంకూ సరఫరాలో కోత ఉండదు.
- మే 31 వరకు, విద్యుత్ సరఫరా కోసం ఉత్పత్తి సంస్థల వద్ద పంపిణీ సంస్థలు డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని 50 శాతానికి తగ్గింపు.
- ఉత్పత్తి సంస్థలు, సరఫరా లైసెన్సుదారులకు ఆలస్యంగా జరిగే చెల్లింపులపై సర్‌ఛార్జీల విధింపు రద్దు.
- రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు ఇవే మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన.
ఇదీ చూడండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!