అది 2019, ఫిబ్రవరి 14.. భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామా దాడి జరిగిన రోజు. అదే రోజున భారత్ తన త్రివిధ దళాలను హై అలర్ట్ చేసింది. ముఖ్యంగా నావికాదళాన్ని జలాంతర్గాములు, అణు జలాంతర్గాములతో సహా దేశ తీర ప్రాంత జలాల్లో మోహరించింది. పాకిస్థాన్ ప్రాదేశిక తీర ప్రాంత సమీపంలో దాయాది చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి భారత యుద్ధ నౌకలు.
భారత్ చర్యలను గమనించిన దాయాది దేశం పాక్... భారత్ కచ్చితంగా పుల్వామా దాడికి బదులు తీర్చుకునేందుకు తన నావికాదళంతో తమపై విరుచుకుపడుతుందని అంచనా వేసింది.
భారత్ మాత్రం పాకిస్థాన్ సైన్యంపై డేగ కన్ను వేసి ఉంచింది. ఓ వైపు నౌకాదళం, మరో వైపు భారత సైన్యాన్ని పటిష్ఠ పరిచి.. 2019, ఫిబ్రవరి 26న ఊహించని రీతిలో బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాయాది తేరుకునే లోపు మన మిరాజ్‌లు పనికానిచ్చి సురక్షితంగా తిరిగొచ్చాయి.
పాక్ ఏం చేసింది..?
బాలాకోట్ దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌కు చెందిన అత్యంత ఆధునిక అగోస్టా జలాంతర్గామి- పీఎన్ఎస్ సాథ్ ఆ దేశ ప్రాదేశిక జలాల నుంచి మాయమైంది.
మిగిలిన జలాంతర్గాములతో పోలిస్తే పీఎన్ఎస్ సాథ్ చాలా శక్తిమంతమైనది. ఫ్రాన్స్, పాకిస్థాన్ కలసి దీనిని తయారు చేశాయి. ఇతర జలాంతర్గాములలా కాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇది నీటిలో ఉండగలదు. ఈ విషయం గమనించిన భారత నౌకాదళం ఈ జలాంతర్గామి కోసం వేట మొదలుపెట్టింది.
ఈ పీఎన్ఎస్ సాథ్.. కరాచీ సమీపంలో మాయమైంది. ఇది 3 రోజుల్లో గుజరాత్ తీర ప్రాంతానికి, 5 రోజుల్లో ముంబయి పశ్చిమ ఓడరేవుకు చేరుకోగలదు. అదే జరిగితే భారత దేశ భద్రతకే పెనుముప్పు తప్పదు.
భారత్ అవిశ్రాంత వేట..
జలాంతర్గాములను నిలువరించే ప్రత్యేక యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు పాక్ జలాంతర్గామి కోసం డేగ కన్నుతో వేటాడాయి. పీఎన్ఎస్ సాథ్కు ఉన్న కాలచట్రం ప్రకారం, అది వెళ్లగలిగే ప్రదేశాలైన గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలను నౌకాదళం జల్లెడ పట్టిందని సమాచారం. పీ-81యుద్ధ విమానాలూ అన్వేషణ సాగించాయి.
ఒక వేళ కనిపిస్తే...
ఒక వేళ అన్వేషణ ఫలించి పీఎన్ఎస్ సాథ్ కనిపిస్తే ఏం చేయాలనే దానిపై నౌకదళానికి స్పష్టమైన ఆదేశాలిచ్చిందట ప్రభుత్వం. భారత ప్రాదేశిక జలాల్లోకి పీఎన్ఎస్ సాథ్ ప్రవేశిస్తే బలవంతంగా దానిని తీర ప్రాంతానికి రప్పించి... అవసరమైతే సైనిక చర్యలకు ఉపక్రమించేందుకు భారత్ సిద్ధమైంది.
మరోవైపు...
ఈ అన్వేషణ కొనసాగిస్తూనే మరోవైపు అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రను పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశింపజేసింది భారత్. పాకిస్థాన్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా చూసేందుకు మన నౌకాదళం అమ్ములపొదిలోకి కొత్తగా చేరిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరిని మోహరించింది భారత్.
అన్వేషణ తీవ్రం...
రోజులు గడిచేకొద్ది... భారత నౌకాదళం అన్వేషణ తీవ్రతరం చేసింది. పీఎన్ఎస్ సాథ్ను కనిపెట్టడానికి ఉపగ్రహాల సాయం కూడా తీసుకొంది. అయితే కావాలనే పాక్ ఈ జలాంతర్గామిని ఎక్కడో దాచి ఉంటుందనే సందేహం భారత్‌కు ఉందట.
ఎట్టకేలకు చిక్కింది..
21 రోజుల సుదీర్ఘ వేట తర్వాత భారత నావికాదళానికి పీఎన్ఎస్ సాథ్ ఆచూకీ చిక్కింది. పశ్చిమ పాకిస్థాన్‌లో ఈ జలాంతర్గామిని దాచి ఉంచింది దాయాది దేశం. ఒక వేళ బాలాకోట్ దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే... భారత్‌ను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతోనే పీఎన్సాథ్ను రహస్యంగా పశ్చిమ తీరంలో దాచిపెట్టింది పాక్.
ఇప్పటికీ గస్తీ..
విశ్వసనీయ సమాచారం మేరకు భారత నౌకాదళం అరేబియా సముద్రం, ముఖ్యంగా పాకిస్థాన్ తీర ప్రాంతంపై, ఆ దేశ నావికాదళం చర్యలపై ఇప్పటికీ ఓ కన్ను వేసి ఉంచిందట.
ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ భారత నావికాదళం యుద్ధ విమానం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, యుద్ధ బలగాలు, 60 యుద్ధనౌకలను ఉత్తర అరేబియా సముద్రంపై మోహరించి ఉంచింది.
అరేబియా సముద్రం చుట్టూ భారత నావికాదళం గస్తీ కాస్తున్నందున పాకిస్థాన్ నౌకాదళం మక్రాన్ తీరప్రాంతంలో తప్ప... మరెక్కడా సముద్రంలోకి వచ్చే సాహసం చేయడం లేదని భారత నావికాదళ ప్రతినిధి డీకే శర్మ ఆనాడు చెప్పారు.
- ఇదీ చూడండి: 'ఆటో 2.0': ఈగ, ఊసరవెల్లి, పక్షి రాజు