దేశంలో నెలకొన్న కాలుష్యం సమస్యను ఒక్క రోజులోనే పారదోలలేమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. కాలుష్య కారకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కార్యాచరణ రూపొందించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఫేస్‌బుక్ లైవ్‌లో తనను అనుసరించేవాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు జావడేకర్. ట్రాఫిక్, పరిశ్రమలు, వ్యర్థాలు, దుమ్ముధూళి, భౌగోళిక అంశాలు, వాతావరణ అంశాలను... దేశంలో వాయు కాలుష్యానికి కారణాలుగా పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలో ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం దేశంలో 2 లక్షల ఈవీల వరకు వినియోగంలో ఉన్నాయని జావడేకర్ వివరించారు. తనకూ ఓ ఎలక్ట్రిక్ స్కూటీ ఉందని రోజూ దానికి ఇంట్లో ఛార్జింగ్ పెడతానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బీఎస్-6 ఇంధనాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చిందని.. దీనిద్వారా వాహనాల నుంచి వెలువడే హానికర వాయువులను 60 శాతం మేర తగ్గించవచ్చని చెప్పారు. మెట్రోలు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం ద్వారా కాలుష్యాన్ని చాలావరకు తగ్గించినట్లు జావడేకర్ స్పష్టం చేశారు.
సమీర్ యాప్‌తో కాలుష్య తీవ్రత..
2016లో దేశంలో వాయుకాలుష్యం ఉన్న రోజులు 250గా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 180కి తగ్గిందన్నారు జావడేకర్. కాలుష్య నివారణకు ప్రజలు పెద్దఎత్తున సహకరించాలని పిలుపునిచ్చారు. అందరూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన సమీర్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దీని ద్వారా దేశంలోని ఏ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందో రెడ్‌మార్క్ చూసి తెలుసుకోవచ్చని వివరించారు.