స్టెల్లా మారిస్ కళాశాల విద్యార్థినులతో రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతులపై ఆరా తీస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఏ విధంగా అనుమతులు ఇచ్చారని పేర్కొంటూ కళాశాలపై దర్యాప్తునకు ఆదేశించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం స్టెల్లా మారిస్ కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రఫేల్ వివాదంపై మరోమారు భాజపాపై ఆరోపణలు చేశారు. రాబర్ట్ వాద్రాపై ఓ విద్యార్థిని ప్రశ్నించగా చట్టం అందరికిీ సమానంగా వర్తిస్తుందని పేర్కొన్నారు.
విచారణకు ఆదేశించిన కళాశాల బోర్డు
ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు కళాశాల విద్యా బోర్డు డైరెక్టర్ ఆర్.సరుమతి. లోక్‌సభ ఎన్నికల నియమావళి అమలులో ఉండగా రాహుల్ సమావేశానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని రీజనల్ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించారు.
ఎన్నికల నియమావళిని పాటించాలి
చెన్నైలో ఉన్న 10 ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో స్టెల్లా మారిస్ ఒకటి. ఇలాంటి విద్యాసంస్థలు రాష్ట్ర నియమాలనే కాదు, ఎన్నికల నియమావళిని అనుసరించాలనే నిబంధన ఉంది.
ఎన్నికల నియమావళి ప్రకారం విద్యా సంస్థలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్) వాటి మైదానాలను ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు వినియోగించకూడదు.
యాజమాన్యం మౌనం
కళాశాల విద్యాబోర్డు విచారణ చేపట్టిందా అన్న ప్రశ్నకు స్పందించలేదు స్టెల్లా మారిస్కళాశాల యాజమాన్యం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సైతం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.