హరియాణాలో సోనిపట్ నుంచి అంబాలా వరకు 200 కి.మీ.ల పొడవునా విస్తరించి ఉన్న ప్రాంతమే ‘జీటీ రోడ్ బెల్ట్’. పచ్చదనంతో అలరారుతుంటుంది. దేశంలోకెల్లా నాణ్యమైన బాస్మతి బియ్యానికి ప్రసిద్ధి. మొఘలులు, బ్రిటిషర్లు కూడా అప్పట్లో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రసిద్ధి చెందిన స్వదేశీ, విదేశీ హోటళ్లు ఇక్కడున్నాయి. ‘కురుక్షేత్ర’ ప్రాంతం ఇందులో భాగమే. హరియాణాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గాను జీటీ రోడ్ ప్రాంతంలో 4 (అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, సోనిపట్) ఉన్నాయి. ఇది 6 (అంబాలా, కురుక్షేత్ర, యమునానగర్, కర్నాల్, పానిపట్, సోనిపట్) జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడే 35 (దాదాపు 39 శాతం) స్థానాలున్నాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నాల్ జీటీ రోడ్ ప్రాంతంలోని భాగమే.
కమలవికాసం
2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన భాజపా జీటీ రోడ్ ప్రాంతం నుంచే ఎక్కువ స్థానాలను (23) సాధించింది. గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత మరింత బలోపేతం అయింది. ఇక్కడి 4 లోక్‌సభ స్థానాల పరిధిలో ఏకంగా 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా ఆధిక్యం కనబరిచింది. సోనిపట్ పరిధిలోని 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పట్టు నిలుపుకోగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబాలా లోక్‌సభ స్థానం పరిధిలోని మొత్తం నియోజకవర్గాల్లో భాజపా విజయకేతనం ఎగురవేసింది.
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ)కు 2, కాంగ్రెస్‌కు 6, స్వతంత్రులకు 4 స్థానాలు దక్కాయి. గత ఎన్నికల తర్వాత ఇక్కడ పట్టు కోల్పోయిన కాంగ్రెస్‌కు ఈసారి భాజపాను నిలువరించడం అతిపెద్ద సవాల్‌గానే చెప్పాలి. ఐఎన్‌ఎల్‌డీ పరిస్థితి కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ లేదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఈసారి ఓటర్ల మొగ్గు ఎటువైపో చూడాలి.
హోరాహోరీ ప్రచారం
జీటీ రోడ్ ప్రాంతానికి అన్ని పార్టీలు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఇక్కడ ప్రచారానికి అవి చేసిన ఏర్పాట్ల ద్వారానే స్పష్టమవుతోంది. కీలక ప్రముఖులంతా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కురుక్షేత్ర జిల్లాలో ఈనెల 15న నిర్వహించే ‘మెగా ర్యాలీ’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆ పార్టీకి చెందిన ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు తదితరులు ప్రచారంలో పాల్గొంటారు.
చాలాకాలం తర్వాత కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా ఇతర నేతలు కూడా ప్రముఖ ప్రచారకర్తల్లో ఉన్నారు. అలాగే ఐఎన్‌ఎల్‌డీ, జన్‌నాయక్ జనతా పార్టీల కీలక నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారు.
కుటుంబ సంక్షేమం కోసమే ప్రతిపక్షాలు
" కాంగ్రెస్, ఎన్‌సీపీల నాయకులు వారి కుటుంబ సంక్షేమం కోసమే పనిచేస్తారు. భాజపా, శివసేనలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయి. శరద్‌పవార్ కుటుంబానికి చెందిన మూడో తరం నాయకులు ఎన్నికల బరిలో దిగారు. పోటీ చేసేందుకు వేరే నాయకులే వారికి దొరకలేదా? ఇలాంటి కుటుంబ పార్టీలు మహారాష్ట్ర సంక్షేమానికి కృషి చేయలేవు. కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం కశ్మీర్ అంశంపై బ్రిటన్ లేబర్ పార్టీ నాయకులను కలసి చర్చించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి."
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
ప్రధాని మోదీ ప్రచారం ఇలా..
మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఈ నెల 13 నుంచి 18 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 13న జల్‌గావ్, సకోలి; 16న అకోలా, పన్వేల్, పార్తుర్; 17న పుణే, సతారా, పర్లీ; 18న ముంబయిల్లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు.
కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవే..
హరియాణాలో ఎన్నికల ప్రణాళిక
- అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రైతులకు రుణమాఫీ
- స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రైవేటు పరిశ్రమల్లో రిజర్వేషన్లు
- వ్యవసాయానికి, గృహాలకు ఉచిత విద్యుత్తు
- మహిళలకు రాయితీలు..వితంతువులు, వికలాంగులు, అవివాహితులకు రూ.5100 పింఛన్
- పీజీ చేసిన నిరుద్యోగులకు రూ.10వేలు, గ్రాడ్యుయేట్లకు రూ.7వేలు చొప్పున భృతి
- విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకూ ఉపకారవేతనాలు
ఆ నాలుగు..
హరియాణాను ప్రధానంగా 4 భాగాలుగా చూడొచ్చు.
- జీటీ రోడ్ బెల్ట్ (జీటీ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతం),
- జాట్‌లాండ్ (జాట్‌లు ఎక్కువగా ఉండే ప్రాంతం)
- అహిర్వాల్ (యాదవ్ సామాజికవర్గ జనాభా ఎక్కువ)
- మేవాత్ (ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం)
ఇందులో జీటీ రోడ్ ప్రాంత ఓటర్లలో జాట్‌యేతరులు ఎక్కువ. 62 శాతం మంది ఎస్సీ, ఓబీసీ ఓటర్లే. కొన్నిచోట్ల జాట్, పంజాబీ, బ్రాహ్మణ ఓటర్ల ప్రాబల్యం ఉంది.
ఇదీ చూడండి: హరియాణా పోరు: ఖట్టర్, హుడాల ప్రతిష్ఠకు సవాల్!