భళా నాయక భళా! కరోనా విజృంభిస్తున్న వేళ... పోలీసులు, వైద్యులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారికి విశ్రాంతినిస్తూ ఆ స్థానంలో రాజకీయ నాయకులు బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చిన విశేషమిది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఒకటిన్నర నెలలుగా ఇక్కడి వైద్యులు, పోలీసులు తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. వీరిలో కొందరు కరోనా బారిన పడ్డారు. ఈ యోధులకు కాస్తంత విశ్రాంతినివ్వాలని జిల్లాలోని వైజాపుర్ నగర రాజకీయ నాయకులు భావించారు.
మంచి స్పందన
శివసేన ఎమ్మెల్యే రమేశ్ బొర్నారే ప్రతిపాదించిన ఈ ఆలోచనకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 3.75 లక్షల మంది నివసించే వైజాపుర్‌లో అందరూ 2రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ పాటించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఆ రోజుల్లో నగరంలో దుకాణాలన్నీ మూసివేశారు. స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితోపాటు పోలీసులు, వైద్యులకు సెలవిచ్చారు. వారి స్థానంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రైవేటు వైద్యులు విధులు చేపట్టారు. చెక్‌పోస్టులు సహా ఇతరచోట్ల నాయకులు, స్థానిక యువత పనిచేశారు. జిల్లా ఆసుపత్రి సహా పలు ఆరోగ్యకేంద్రాల్లో ప్రైవేటు వైద్యులు చికిత్సలు అందించారు. దీనివల్ల పోలీసులు, వైద్యులకు కాస్త సాంత్వన లభించినట్లయింది. వైజాపుర్ స్ఫూర్తితో మరికొన్ని చోట్లా ఈ విధానాన్ని అమలు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా విజృంభణ: లక్షకు చేరువలో కేసులు