కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా 21 రోజులు విధించిన లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లలో ఉండాలని అధికారులు ఎంత చెప్పినా.. కొంత మంది వినకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు రోడ్లపై ఎవరు కనిపించినా పోలీసులు చితకబాదుతున్నారు. మరోవైపు ఆకలితో అలమటిస్తున్న వారికి బాసటగా నిలుస్తూ దాతృత్వం చాటుతున్నారు రక్షక భటులు.
మేమున్నామంటూ...
పంజాబ్ లూథియానాలో లాక్డౌన్ నేపథ్యంలో కనీస నిత్యవసరాలు లేక.. ఆకలితో ఆలమటిస్తున్న వారికి ఆహారం సమకూరుస్తున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్లోనూ తిండికి నోచుకోని వారికి చేయూతగా నిలబడ్డారు సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది. వివిధ రకాల ఆహార పదార్థాలను ప్యాక్ చేసి అవసరమైన వారికి పంచుతున్నారు.
మూగజీవులకు ఆసరాగా...
మాహారాష్ట్రలో కాజల్, దిశ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూగజీవుల ఆకలిని తీరుస్తున్నారు. జనజీవనం స్తంభించి, శునకాలు ఆహారం కోసం అలమటిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాటి ఆకలి తీర్చడం మన బాధ్యతని చెప్పారు వారు.
దేశమంతా కరోనాపై పోరాటం.. మేము మాత్రం..
కోల్కతాలోని దమ్ దమ్ రైల్వే స్టేషన్ అండర్ పాస్ వద్ద ఆశ్రయం పొందిన వారికి.. కొంత మంది సామాజిక కార్యకర్తలు చేయూతగా నిలిచారు. 3 రోజులుగా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించి, దుకాణాలు మూసేయడం వల్ల వీరంతా తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశమంతా కరోనాపై పోరాడుతోంటే.. తాము ఆకలితో పోరాడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోల్కతాలోని వీధులన్నీ కర్ఫ్యూ వల్ల నిర్మానుష్యంగా మారాయి.