మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారిని మిసెస్ ఇండియా కిరీటం వరించింది. పుణె సిటీ పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న 'ప్రేమ విగ్నేష్ పాటిల్' 2019 మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్లో 20 మందితో పోటీపడి విజేతగా నిలిచారు. అందంతో పాటు విజ్ఞానం కలిగిన మహిళగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రేమ పాటిల్.
మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ నగరానికి చెందిన ప్రేమ విగ్నేష్.. కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2010లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు శాఖలో చేరారు. ముంబయిలోని ఠాణే పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తించిన ఈ అధికారిణి.. ఎన్నో దొంగతనాల కేసులను ఛేదించారు. అలాగే మహిళలపై దాడులను తగ్గించేందుకు తనవంతు కృషి చేశారు. ఆ తర్వాత ప్రత్యేక రక్షణ దళంలోనూ పనిచేసిన ఈమె ప్రస్తుతం పుణెలోని స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ అందాల పోలీసు అధికారి 2014లో విగ్నేష్‌ను పెళ్లాడారు. ప్రస్తుతం వీరికి రెండేళ్ల బాలుడు ఉన్నాడు.
తన భర్త ప్రోద్బలంతోనే ఈ అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ప్రేమ స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో పాటు పోలీసుశాఖవారు తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పుకొచ్చారీ పోలీస్ అధికారి.
"హై హీల్స్‌తో ర్యాంప్ వాక్ చేయడం నాకు అతిపెద్ద సవాలుగా ఉండేది. అయితే సాధనతో ఈ సమస్యను అధిగమించాను. రోజూ దినపత్రికలు చదవడం కూడా నాకు ఎంతో కలిసొచ్చింది."
- ప్రేమ విగ్నేష్ పాటిల్