దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ ముసుగు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రజాసాయం కోరారు దిల్లీ పోలీసులు. తాము తగిన సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నందున.. ప్రత్యక్షంగా చూసినవారితో పాటు ఎవరైనా ఫొటోలు, వీడియోలు తీసుంటే తమకు అందించాలని కోరారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు చెందిన భౌతిక, రసాయన, జీవశాస్త్ర విభాగ బృందాలు కూడా ఆధారాల కోసం జేఎన్‌యూను జల్లెడ పడుతున్నట్లు తెలిపారు.
మంచి పౌరులుగా ఎదగాలి
జేఎన్‌యూ విద్యార్థులపై దాడి నేపథ్యంలో.. విశ్వవిద్యాలయాలు విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రం కాకూడదన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వర్సిటీల్లో చదువుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలే తప్పా.. వర్గ పోరు, విభజన ధోరణులకు కాదన్నారు. పిల్లలు విద్యా సంస్థల నుంచి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే సమయానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా రూపొందాలన్నారు వెంకయ్యనాయుడు.
ప్రకాశ్ జావడేకర్ అసంతృప్తి
జేఎన్‌యూ ఘటనపై స్పందించారు కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఈ దాడిపట్ల జేఎన్‌యూ పరిపాలన విభాగం వ్యవహరించిన తీరుపై జావడేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు హోంశాఖ దర్యాప్తునకు ఆదేశించిందని.. నిందితులను తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
ఇదీ జరిగింది
ఈనెల 5న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్క్‌లు ధరించి జేఎన్‌యూలోకి ప్రవేశించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ఆచార్యులే లక్ష్యంగా రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 34 మంది గాయపడ్డారు.