కరోనా లాక్‌డౌన్‌తో ప్రస్తుతం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు మృతి చెందినవారిలో ఎక్కువశాతం 60ఏళ్లు పైబడిన వారున్నందున ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. నిత్యావసర సరకులతో పాటు మందులకూ గడప దాటి అడుగు బయట పెట్టలేకపోతున్నారు. పిల్లలు విదేశాల్లో నివాసముంటూ.. ఇతర కుటుంబసభ్యులెవరూ తోడులేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇలాంటి వారికి బాసటగా నిలుస్తున్నారు దిల్లీ, లఖ్‌నవూ పోలీసులు.
దిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో ఆహారం, మందులు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆర్ భాషన్ దంపతులకు సాయం చేశారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సోమ్‌నాథ్ పరుతి. వారికి ఏం కావాలో ఫోన్ ద్వారా తెలుసుకుని అందించారు.
"మా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇక్కడ నేను, నా భార్య మాత్రమే నివసిస్తున్నాం. మేము మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నాం. కొన్ని అత్యవసర వస్తువులు కావాల్సినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకే మేము ఎస్హెచ్ఓకు ఫోన్ చేశాం. ఆ తర్వాత కొద్ది సేపటికే పోలీసులు మాకు కావాల్సినవి తెచ్చి ఇచ్చారు. దిల్లీ పోలీసులు మాకు ఎంతో సాయం చేస్తున్నారు."
- ఆర్ భాషన్, గ్రేటర్ కైలాష్ స్థానికుడు
పోలీసులు స్వీట్లు తినిపిస్తే..
లఖ్‌నవూలో 83 ఏళ్ల ఒంటరి వృద్ధుడికీ ఇదే తరహాలో సాయం చేశారు పోలీసులు. ఆర్సీ కేశర్వానీ అనే వృద్ధుడు శరీరంలో చక్కెర పరిమాణాలు తగ్గి బాధపడుతూ పోలీసుల సాయం కోరాడు. వెంటనే స్పందించిన రక్షకభటులు అతడికి స్వీట్లు తినిపించారు.
ప్రస్తుతం కేశర్వానీ కొడుకు, కోడలు అమెరికాలో నివాసముంటున్నారు.