రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్ నియామకాన్ని రాజకీయ నేతలు స్వాగతించారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణమే సమస్యకు అసలైన పరిష్కారమని భాజపా సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.
"సుప్రీంకోర్టుకు పూర్తి అధికారం ఉంది. కోర్టు ఏది చెప్పినా గౌరవించాల్సిన అవసరముంది. అయితే రామ జన్మస్థానంలో రామమందిరం నిర్మించాల్సిందే. ఆ చుట్టుపక్కల రాముడికి సంబంధించిన ఆలయాలే ఉండాలి. మసీదులనూ మేం గౌరవిస్తాం. మక్కా మదీనాలో ఎవరైనా ఆలయం నిర్మించడానికి ప్రయత్నిస్తే మేమే అడ్డుకుంటాం. అది వారి ప్రదేశం. అక్కడ మసీదే ఉండాలి."
- ఉమాభారతి, కేంద్రమంత్రి
నిజాయితీ ప్రయత్నం
అయోధ్య వివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు నిజాయితీగా ప్రయత్నిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు.
"అయోధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తి నియామకంతో సరైన నిర్ణయం తీసుకుంది సుప్రీం. సామరస్యంగా సమస్య పరిష్కారానికి కోర్టు ప్రయత్నిస్తోంది."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి
తటస్థ వ్యక్తులుండాలి
మధ్యవర్తుల ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ నియామకంపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
"తటస్థ వ్యక్తిని సభ్యుడిగా సుప్రీం నియమిస్తే బాగుండేది. అందులోని సభ్యుడు అయోధ్యపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు రాజీ పడకపోతే సిరియా తరహాలో భారత్ మారుతుందని హెచ్చరించారు. మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆ భావనలు పక్కన పెడతారని ఆశిస్తున్నాను. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం."
- అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'ఎస్పీ ప్రభుత్వం వల్లే'
"మధ్యవర్తిత్వంపై సుప్రీం గత పయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. కోర్టు పర్యవేక్షణలో చర్చలు జరగటం అభినందనీయం. చూద్దాం ప్యానెల్ ఏం పరిష్కారం చూపుతుందో"
- బృందా కారాట్, సీపీఎం నాయకురాలు
ముస్లిం సంఘాల ప్రశంస
సుప్రీం నిర్ణయాన్ని అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలి(ఏఐఎంపీఎల్బీ) స్వాగతించింది.
"సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరముంది. చర్చలతో సమస్య పరిష్కారమనేది మంచి నిర్ణయం. సుప్రీం పర్యవేక్షణలో గోప్యంగా ప్రక్రియ కొనసాగితే చర్చలు ఫలించే అవకాశముంటుంది."
-మౌలానా వాలి రెహ్మానీ, ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి