భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై.. విపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) పేర్కొంది. భారత భూభాగంవైపు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికులు లేరని చెప్పాలన్న ఉద్దేశంతోనే అఖిలపక్ష భేటీలో మోదీ ఇలా అన్నారని వివరణ ఇచ్చింది.
"భారత సాయుధ దళాలు అత్యంత ధైర్యసాహసాలతో సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాయి. అందువల్ల 'భారత భూభాగంలోకి చైనీయులు చొరబడలేదు. సైనిక పోస్టులను ఆక్రమించలేదు' అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే భారత భూభాగంలోని ఇసుమంత రాయిని కూడా శత్రు దేశాలపరం కానివ్వమని మోదీ హామీ ఇచ్చారు.
చైనా వాస్తవాధీన రేఖ వెంబడి అక్రమ నిర్మాణాలు చేయడానికి చేసిన ప్రయత్నాలను 16వ బిహార్ రెజిమెంట్ విఫలం చేసింది. శత్రుమూకలు భారత్‌లోకి చొరబడకుండా అట్టుకుంది. అది మన భారత సైనికుల సత్తా."
- ప్రధాని కార్యాలయం
మరి ఘర్షణ ఎందుకు జరిగింది?
చైనా బలగాలు తూర్పు లద్దాక్ గల్వాన్ లోయ వద్ద భారత భూభాగంలోకి చొరబడకపోతే .. మరి భారత సైనికులు ఎక్కడ చనిపోయారని కాంగ్రెస్ సహా రక్షణ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రధాని మోదీ... చైనాకు క్లీన్చిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైనికులకు ఆయుధాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం... భారత భూభాగంలోకి ఎవరూ చొరబడకపోతే.. జూన్ 5, 6 తేదీల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలకు, రక్షణ, విదేశాంగ మంత్రుల ప్రకటనలకు పొంతన లేదని, ఇవి ప్రజలను గందరగోళానికి, అందోళనకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
పీఎంఓ ఈ వ్యాఖ్యలను ఖండించింది. విపక్షాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి: గుడ్‌న్యూస్: కరోనాకు భారత్‌లో డ్రగ్ రిలీజ్