పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) కుంభకోణంపై ముంబయిలో నిరసనలు వెల్లువెత్తాయి. బ్యాంకు ఖాతాల్లోని తమ డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ.. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు డిపాజిటర్లు.
శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆర్బీఐ కార్యాలయం వద్దకు చేరుకున్న ఖాతాదారులు.. పీఎంసీ బ్యాంకు, ఆర్బీఐకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ క్రమంలో ఆందోళనలు చేపడుతున్న వారిలో అస్వస్థతకు గురైన ఇద్దరు వృద్ధులు ఒక్కసారిగా కుప్పకూలారు. గమనించిన భద్రతా సిబ్బంది వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
జరిగిందేమిటీ?
నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం, నియంత్రణ లోపాల కారణంగా ఇటీవల సంక్షోభంలో చిక్కుకుంది పీఎంసీ. సుమారు రూ.4,355 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ కారణంగా పీఎంసీ వినియోగదారుల నగదు విత్ డ్రా, ఇతర లావాదేవీలపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ. మొదట రోజుకు ఒక ఖాతాదారు రూ.1,000 మాత్రమే ఉపసహరించుకునేలా ఆదేశించింది. అనంతరం దానిని రూ. 40 వేలకు పెంచింది.
ఇదీ చూడండి: బ్యాంకు దివాలా తీస్తే... మీరు ఏం చేయాలి?