గుజరాత్లో 'సీప్లేన్' సేవలను ప్రారంభించనున్న మోదీ - modi to inaugurate seaplane service in sabarmati
సబర్మతి నదిలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సేవలను ఆవిష్కరించనున్నారు. అనంతరం నర్మదా నదిపై ఏర్పాటైన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వద్ద నిర్వహించే జాతీయ ఐక్యతా పరేడ్‌లో పాల్గొంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 30న తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించనున్నారు. సబర్మతి నదిలో ఏర్పాటు చేసిన సీప్లేన్(నీటిలో నుంచే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే విమానం) సేవలను అక్టోబర్ 31న ప్రారంభించనున్నారు. నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వద్ద నిర్వహించే జాతీయ ఐక్యతా పరేడ్‌లో పాల్గొంటారు.
దేశంలో మొట్టమొదటి సీప్లేన్ సర్వీసుగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. పర్యటకానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఈ సీప్లేన్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. వాస్నా బ్యారేజీ సమీపంలోని అంబేడ్కర్ బ్రిడ్జి వద్ద సీప్లేన్ ల్యాండింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సబర్మతి నదితో పాటు నర్మదా డ్యాం రిజర్వాయర్, ధారోయ్ డ్యాం రిజర్వాయర్, తాపీ నదిలోనూ సీప్లేన్లు దిగేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లు అనుమతులు ఇచ్చాయి.
అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సీప్లేన్ తొలి ట్రిప్ జరగనుంది. ఈ సర్వీసుల కోసం కెనడా నుంచి రెండు సీప్లేన్లను దిగుమతి చేసుకున్నారు. అక్టోబర్ 20 నాటికి అవి ఇక్కడికి చేరుకోనున్నాయి.