పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న తరుణంలో అఖిలపక్షాలతో దిల్లీలో భేటీ అయింది కేంద్రం. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, తృణమూల్ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విపక్షాల అభిప్రాయాలు వినేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు.
ఆర్థిక సమస్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను భారత్ ఏవిధంగా సానుకూలంగా మార్చుకోవచ్చనే విషయాలపై చర్చకు సిద్ధమని మోదీ చెప్పారు. ఇది మాత్రమే కాదు విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సుముఖం. కానీ చర్చలు అర్థవంతంగా ఉపయోగకరంగా ఉండాలని మోదీ స్పష్టం చేశారు.
-ప్రహ్లాద్ జోషీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
గృహనిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను తక్షణమే విడుదల చేయాలని అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా సీఏఏపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు.
బడ్జెట్ రోజున విపక్షాల భేటీ..
బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఫిబ్రవరి 1న భేటీ కానున్నాయి విపక్షాలు. పౌర నిరసనలు, ఆర్థిక మందగమనం, పెరిగిన ధరల వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై గళమెత్తేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.