పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలో ఓ ఒక్క పౌరునికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మైనారిటీల ప్రయోజనాలకు నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్, వామపక్షాలే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ నేతలే ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు మోదీ.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంగా లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధాని. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించిందన్నారు మోదీ.
"మీరు అనుసరించిన పద్ధతులను మేమూ అనుసరించి ఉంటే, మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే.. 70ఏళ్ల తర్వాత కూడా ఆర్టికల్ 370 రద్దు జరిగి ఉండేది కాదు. మీ ఆలోచనా విధానాలతోనే మేమూ ముందుకు వెళ్లుంటే.. 'ముమ్మారు తలాక్' కత్తి నుంచి ముస్లిం మహిళలకు ఉపశమనం లభించేది కాదు. మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే... అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా చట్టం వచ్చేది కాదు. మీ ఆలోచనలతోనే నడిచి ఉంటే.. రామ జన్మభూమి ఇప్పటికీ వివాదాల్లోనే ఉండేది. మీలాగే మేమూ ఆలోచించి ఉంటే.. కర్తార్‌పుర్ నడవా వచ్చేదే కాదు. మీరు ఎంచుకున్న పద్ధతులనే మేమూ అనుసరించి ఉంటే భారత్-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం దక్కేది కాదు.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాహుల్‌పై ట్యాబ్లైట్ పంచ్..
ఓవైపు భాజపా చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు మోదీ. పలు సందర్భాల్లో విపక్ష నేతలనుద్దేశించి ఛలోక్తులు విసిరారు.
"ఓ కాంగ్రెస్ నేత మాటలను నిన్న నేను విన్నా. 6 నెలల్లో ప్రజలు మోదీని కర్రలతో కొడతారు అని ఆ నేత అన్నారు. ఇది కొంత కఠినమైన సవాలు కాబట్టి.. సన్నద్ధమవ్వడానికి 6 నెలల సమయం పడుతుంది. అన్ని నెలల సమయం అంటే మంచిదే! నేను కూడా సిద్ధంగా ఉంటా. సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తా. 20 ఏళ్లుగా నా మీద వినిపిస్తున్న తిట్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. ఇప్పుడు నేను చేసే సూర్య నమస్కారాలతో నా వీపు ఆ కర్రల దెబ్బలను తట్టుకునేలా సిద్ధం చేసుకుంటా. ముందుగానే చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ 6 నెలలు వ్యాయామ సమయం పెంచుకుంటా. నేను 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. కానీ వారికి అర్థమవడానికి ఇంతసేపు పట్టింది. చాలా 'ట్యూబ్‌లైట్లు' ఇలాగే ఉంటాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అధీర్పై ఛలోక్తులు..
కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకునేందుకు పలుమార్లు ప్రయత్నించడంపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని. అధీర్ పదే పదే లేచి ఫిట్ ఇండియాకు లోక్ సభ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధిద్దాం'
భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ప్రధాని. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులను భారత్‌కు అనుకూలంగా మలుచుకునేందుక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!