విద్యుత్ రంగంలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వంటి అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖలతో ప్రధాని బుధవారం.. సమీక్ష నిర్వహించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ విభాగాల పనితీరును చర్చించారు మోదీ. అధికారులు మూసధోరణి వదిలి... విద్యుత్ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సుంకాల సవరణతో పాటు... విద్యుత్ సవరణ బిల్లు- 2020లోని పలు అంశాలను చర్చించారు.
సౌరశక్తి వినియోగం..
విద్యుత్ పంపిణీ సంస్థలు ఎప్పటికప్పుడూ తమ పనితీరును ప్రచురించాలని చెప్పారు ప్రధాని. దీనివల్ల విద్యుత్ ధరలను ఇతర పోటీ సంస్థలతో బేరీజు వేసుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని అన్నారు. వ్యవసాయానికి సంబంధించి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ విధానం సమగ్రంగా ఉండాలన్న మోదీ... రైతులు సోలార్ పంప్ సెట్లు ఉపయోగించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ప్రతి రాష్ట్రంలో ఒక నగరాన్ని.. సౌర పలకలను ఇంటి పైకప్పులుగా ఏర్పరిచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా తీర్చిదిద్దాలని ప్రధాని అధికారులకు సలహా ఇచ్చారు.