దేశంలోని 130 కోట్ల మందికి సేవ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, న్యాయం అందించటమే ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన సామాజిక సాధికారిత శిబిరంలో వృద్ధులు, దివ్యాంగులకు కావాల్సిన ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఏడీఐపీ పథకాల కింద 19 కోట్ల ఖర్చుతో సుమారు 27 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా సుమారు 56 వేల పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు ప్రధాని. దివ్యాంగుల కోసం వారు ఏమి చేయలేకపోయారన్నారు.
" 27 వేల మందికి ఉపకరణాలు అందించాం. అందులో మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు లభించాయి. ఈ సామాజిక సాధికారిత శిబిరంలో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఈ ఉపకరణాలు మీ జీవితంలోని సమస్యలు తగ్గిపోయేందుకు ఉపయోగపడతాయి. గత ప్రభుత్వాల సమయంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయటం చాలా అరుదు. ఇలాంటి మెగా క్యాంపులు చేపట్టిన దాఖలాలు లేవు. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 9 వేలకుపైగా క్యాంపులు చేపట్టింది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఈ కార్యక్రమానంతరం ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని. చిత్రకూట్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!